శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
శిఖరదర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.
అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో, కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంతదూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదో విధంగా ఈ కొండ శిఖరం (శిఖరేశ్వరం) కనబడేవరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని (Srisailm Sikhara Dharsanam) చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు.
ఎంత దూరం నుంచి అయినా యీ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏక కంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది.
ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా, ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా ఆరు నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.
శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన ‘వీరశంకరుడు‘ కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు.
ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్థంగా చెప్పే ఆధారాలు నేటి వరకూ లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న సా.శ. 1398 (శా.శ 1320) పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర పైభాగానికి భక్తులు తండోప తండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది.
సోపాన నిర్మాణం
ప్రోలయవేమారెడ్డి రాజ్యానికి శ్రీశైలం పడమరసరిహద్దుగా ఉన్నపుడు ఈ ప్రాంతం మీద అధిపత్యానికి రెడ్లకు, విజయనగర రాజులకు, రాచకొంద వెలమ దొరలకు తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి.
యుద్ధాలు జరుగునపుడు సైనికులు లేదా శ్రీశైలము చేరాలనుకొనే భక్తులకు గాని సరియన ప్రయాణ మార్గము లేదని ప్రోలయ మార్గ నిర్మాణానికి కొంతవరకూ కృషి చేసాడు.
అదే పనిగా శిఖర దర్శనానికి ఇబ్బంది పడుతున్న భక్తులను చూసి దానికి సోపానాలు నిర్మించాలని మంత్రి రామయదేవునికి ఆదేశాలిచ్చాడు.
సోపాన నిర్మాణ ఇదే కాలంలో జరిగినది అని చెప్పే శాసనము ఏదీ లభ్యం కాకున్నా కొంత సమాచారం మాత్రం ప్రాచీన శాసనమైన చీమకుర్తి (క్రీ, శ,1335) శాసనంలో లభిస్తుంది.
“అనవరత పురోహితకృత సోమపాన శ్రీ పర్వతాహోభల నిర్మితసోపానాధిక్కాంతామనోహరకీర్తికుసుమామోద” అలా చెప్పబడిన విషయాన్ని బట్టి ఇవి క్రీ, శ, 1326-1335 మధ్య నిర్మించబడినాయని చెపుతారు.
చీమకుర్తి శాసనం తెలుగు భాగంలో ” చైనశీతి దుర్గనిర్మాణ చతుర శ్రీశైలశిఖరాక్రాంతసోపానరచనాశ్రేయస్సంపాదిత” అని చెప్పబడింది. సా.శ. 1343 నాటి మరొక శాసనం అయిన ముట్లూరి శాసనంలో ఇలా చెప్పబడింది.
స్తంభాం కీర్తిక సృజంత్యకుశలా భూమీశ్వరానన్వరా
నిర్మానన్యకృతేర్వినిర్మలమతే శ్రీవేమపృధ్వీపతే
యేన శ్రీగిరిరప్యహోబలగిరిస్సోపానమార్గాంకితౌ
విఖ్యాతే రచితౌ సనాతనయశస్తణ్భతలం భూతలే
🙏 ఓం నమః శివాయ 🙏