హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా, పూజ చేయాలన్నా ప్రథమంగా వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం వినాయకుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే వినాయక చవితిని (Vinayaka Chavithi) దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
వినాయక చవితి కథ (Story Behind Vinayaka Chavithi in Telugu)
పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహాశివుడిని దాచుకుంటాడు. కొన్ని రోజులకు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ దేవి శ్రీమహావిష్టువు సహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకొని గంగిరెద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగిరెద్దును గజాసురుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా.. తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువేనని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని శివుడిని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుడి వస్త్రంగా ధరించమని కోరుకొని మరణించాడు.
కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు స్నానమాచరించడానికి సిద్దమవుతుంది. ఆ సమయంలో నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారుచేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి..ఎవ్వరినీ లోపలికి రానివ్వవద్దని చెప్తూంది. ఆ సమయంలోనే శివుడు అక్కడకు వస్తాడు. అడ్డుకోబోయిన బాలుడి శిరచ్ఛేదనం చేస్తాడు. మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తుంది. దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి బతికిస్తాడు. అప్పటి నుండే వినాయకుడు గజాననుడు అయ్యాడు. వినాయకుడి వాహనం ఎలుక.
కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు.
ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమార స్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు.
వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన రుషి పత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు.