దసరా (విజయ దశమి) పండుగ ప్రత్యేకత, విశిష్టత మరియు చరిత్ర

ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటినుండి 9 రోజులు జరిగే దేవి నవరాత్రుల ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరదృతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అనికూడా పిలుచుకుంటాము.

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది.

Durga Devi

దసరా పండుగ చరిత్ర Dasara History in Telugu

1. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటంవల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు.

అప్పటి నుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడినుండి వజ్రాయుధం, విష్ణువునుండి సుదర్శన చక్రం, శివుడినుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది.

దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వాదించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీనవరాత్రులుగా 10 వ రోజును విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటాము.

2. రామాయణ గాధ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా పరిగణిస్తారు.

3. మహా భారతంలో పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు.

విజయదశమి ప్రత్యేకత
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి.

శమీ వృక్షం (Jammi Chettu) సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధన మరియు నగదు స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుందని భావిస్తారు.

పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది.

అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.

సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు (ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు) దీనిని ఆచరిస్తారు.

ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది.

అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. 9 రోజులు అమ్మవారిని 9 అవతారలతో అలంకరించి పూజిస్తారు. 9 రోజులు 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.

9 రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు

1.స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి – వడపప్పు , పొంగలి
2. బాలాత్రిపుర సుందరి – పొంగలి
3. గాయత్రీ దేవి – పులిహోర
4. అన్నపూర్ణా దేవి – కొబ్బెరన్నం
5. కాత్యాయనీ దేవి – అల్లం గారెలు
6. లలితా దేవి – దద్దోజనం
7. శ్రీలక్ష్మీ దేవి – రవ్వ కేసరి
8. మహా సరస్వతీ దేవి – కదంబం
9. మహిషాసురమర్దిని – బెల్లం అన్నం
10. రాజరాజేశ్వరీ దేవి – పరమాన్నం

విజయదశమి నాడు ఏం చెయ్యాలి?
ఈ రోజున ఉదయాన్నే లేచి తలా స్నానాలు ఆచరించి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, బతి పూలతో తోరణాలను అలంకరిస్తారు. సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధు మిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు.

రావణాసురుని వద్దకు గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, టపాకాయలు పేల్చటం వంటి కార్యక్రమాలతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు.

Exit mobile version