పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.
నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమీ నాడు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంతో దర్శినిమిస్తుంది. మూలా నక్షత్రం అంటే అది అమ్మవారి జన్మనక్షత్రం.
చదువుల తల్లి ఈ సరస్వతి దేవి. మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి సరస్వతి దేవి.

బ్రహ్మ సకల సృష్టి కర్త కావడంతో సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించేందుకు బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని చెబుతారు.
పరాశక్తి ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆమె కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతంలో ఉంది .
వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. హంసవాహినిగా , పుస్తకం మాలా ధారిణిగా శ్వేతవర్ణంలో కనిపించే అమ్మవారి చేతిలో ఉండే వీణపేరు కచ్చపి.
సరస్వతీ దేవి (Saraswati Devi) తెల్లని చీరను ధరించి, దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుని సింహంపై స్వారీ చేస్తూ ఉంటుంది.
శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి నాలుగు చేతులల్లో వీణా, దండం, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో ఈదేవి భక్తులకు దర్శనమిస్తుంది.
సరస్వతీ దేవి (స్కందమాత) ని పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడని భక్తులకు అపార నమ్మకం. విద్యా, జ్ఞానం, మోక్షం, శ్రేయస్సు, మనశ్శాంతి పొందేందకు భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు.
సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
పఠించవలసిన సరస్వతీ అమ్మవారి శ్లోకం
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా,
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా,
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా,
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.