శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది.ఇలా అమ్మవారికి అలంకరించే రూపాలు ప్రాంతాన్ని బట్టి , సంప్రదాయాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి .
తెలుగు రాష్ట్రాలలో అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మకి ఏరోజు ఏఅవతారాన్ని వేస్తే దానినే ప్రామాణికంగా ఇతర దేవాలయాలు , ప్రజలు అనుసరించడం జరుగుతుంది.
ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజును మహర్నవమిగా జరుపుకుంటాము. లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన అమ్మవారు (మహిషాసురమర్దిని)గా మహోగ్రరూపం ధరించి ఉంటారు.
అమ్మవారు సింహమును వాహనంగా అధిష్టించి , ఆయుధాలను ధరించి సకల దేవతల అంశతో దివ్యమైన తేజస్సును కలిగి భక్తులకు దర్శనం ఇస్తుంది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి.
ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు.అన్నిటా విజయం కలుగుతుంది.
ఈ రోజు అమ్మవారిని పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసం నైవేధ్యంగా సమర్పించాలి.
మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా,
జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ శ్లోకాన్ని పఠించాలి.