దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిష్టగా పూజలు చేస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు కనకదుర్గా అమ్మవారు అన్నపూర్ణా దేవీ అవతారం (Annapurna Devi avataram)లో భక్తులకు దర్శనమివ్వనుంది . ఈ తల్లిని అష్టభుజాదేవీ అని కూడా పిలుస్తారు.
చేతిలో రసపాత్రను ధరించి, సాక్షాత్తు పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువుదీరింది. ఈ రోజు అన్నపూర్ణా దేవి అమ్మవారు కాషాయం లేదా బంగారం రంగు చీర ధరించి అష్ట భుజాలతో సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. అన్నపూర్ణా దేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అమ్మరివారికి నైవేద్యంగా పొంగలి, లేదా కొబ్బెరన్నం సమర్పిస్తారు.
‘హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా’ అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి.
కుడివైపు చేతుల్లో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమ వైపు చేతుల్లో చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతోపాటు అష్టఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం.
ఈ భూమి పై సకల జీవరాశికి ఆహరం ప్రధానం . అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సమస్త ప్రాణ కోటికి ఈ తల్లి దయవల్లనే ఆహరం లభిస్తుంది. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలు రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్షపెట్టిన అమ్మ అన్నపూర్ణా దేవి.
కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతోపాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్ సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల్లో నమ్మకం.