ఆశ్వయుజ మాసంలో ఐదవ రోజు అయిన (పంచమి రోజు)న కనక దుర్గాదేవిని శ్రీ లలితా త్రిపురసుందరి దేవి (Sri Lalitha Tripura Sundari Devi) గా అలంకరిస్తారు. ఈరోజు అమ్మను సేవిస్తే సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది.
ఈ అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది. కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింటికి కూడా అమ్మవారు ఆలంబన. శ్రీపక్ర స్థితంగా కనిపించే అమ్మవారు సృష్టి సంబంధమైన వేరువేరు భాగాలలో వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది. దీనినే మేరువుగా కూడా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరు వేరు భాగాలలో ఉండే లలితా అమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది.
చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి.
కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
లలిత త్రిపుర సుందరి దేవి ఈ రోజు ఎరుపురంగు చీరను ధరించి మనలోని మనోకామనలను నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దద్దోజనం. అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు ఉష్ణాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది.