HomeDevotionalBhagini Hastha Bhojanm-భగినీ హస్త భోజనం అంటే ఏమిటి?

Bhagini Hastha Bhojanm-భగినీ హస్త భోజనం అంటే ఏమిటి?

కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. ఈ రోజును యమ ద్వితీయ , పుష్ప ద్వితీయ , కాంతి ద్వితీయ , భ్రాతృ విదియ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముడి చెల్లెలు యమున. అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజుల తరబడి ఆయనకు వీలుపడదు.

ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడటంతో , ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్నవారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోతాడు.

Bhagini Hastha Bhojanm

భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది. మరోవైపు , అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణనూ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి , ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగరాదని యమున కోరుతుంది. ఆయన పరమానంద భరితుడవుతాడు. ఏటా కార్తీక శుద్ధ విదియనాడు ఇంటికి వచ్చి , ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు.
‘నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు , సోదరుడికి ఈరోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది’ అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు.

యమునకు , యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే ‘యమ ద్వితీయ’ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి ‘భగినీ హస్తభోజనం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు – సోదరుడు ఆమెకు చీర , పసుపు , కుంకుమ , పూలు , పండ్లు , ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది. పలువురు నేడు చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంతకుముందు (కార్తిక శుద్ధ పాడ్యమి) పూజలందుకున్న బలి ఇప్పుడు వీడ్కోలు పొంది , పాతాళానికి వెళ్తాడనీ విశ్వసిస్తారు.
ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలందుకుంటాడు. ఈ రోజు చేసే దానధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం , చతుర్వర్గ చింతామణి , భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి.
ఈ యాంత్రిక యుగంలో కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన , సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి , పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఆర్థిక బంధాల్ని ఆర్ద్రపూరితంగా మార్చేవి , అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే ! అనుబంధాలను గుర్తుచేసుకోవడమే కాక , రేపటి తరాలవారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది.
ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని తు.చ. తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సుసాధ్యమవుతుంది !

See also  Thulasi Mala - తులసి మాల లేదా ధాత్రి మాల (ఉసిరి) విశిష్ఠత

అన్నా చెల్లెళ్ళ పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ , ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం… అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి , వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు.

ఎప్పుడు జరుపుకొంటారు

ఈ పండగను
భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి , హారతి ఇచ్చి , మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.

భగిని హస్త భోజనం వెనుక కథ

హిందూ పురాణాల ప్రకారం దీనిని యమ ద్వితీయ , భాయిదూజ్‌గా పిలుస్తారు. ఈ రోజున పురుషులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయన్నది పురాణ ప్రవచనం. సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి & యమున. ఈ ప్రత్యేక పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి , నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా , ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం పర్వదినంగా జరుపుకొంటారు. దీనితో పాటు , మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించిన తరువాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి , తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది.వైవియస్ఆర్

ఎలా చేసుకుంటారు

ఉదయాన్నే సోదరులను ఇంటికి పిలిచి వారితో కలిసి దేవుణ్ని ప్రార్థించి , వారి నుదుటన తిలకం దిద్ది , హారతి ఇచ్చి , వారికి సోదరిమణులు తమ చేతితో వండిన ఆహార పదార్థాలను తినిపిస్తారు. హరియాణా , మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు.

  • మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా – దుజ్’ అని పిలుస్తారు.
  • నేపాల్ ప్రాంతం లో భాయి – టికా అని పిలుస్తారు.
  • పంజాబ్ ప్రాంతం లో ఈపండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు…
See also  Srisailam: ఈ దర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments